జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో పలు సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, అభిమానుల మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు.
ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తాను, నూరోసారి మాత్రమే యుద్ధం చేస్తాను అంటూ పవన్ రాసిన కొటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చాలా మంది పవన్ అభిమానులు వాట్సాప్ డీపీలుగా ఈ పోస్టును పెట్టుకోవడం కనిపిస్తోంది. అయితే పవన్ తాజాగా పెట్టిన పోస్టులో చాలా లోతైన అర్థం ఉందని పలువురు అంటున్నారు. ఏపీ ప్రభుత్వంతో సామరస్యంగా ఉండటానికే తాను ప్రయత్నిస్తానని.. యుద్ధం చేయాల్సి వస్తే తాను ఎప్పుడు రంగంలోకి దిగుతానో సూచనప్రాయంగా చెప్తున్నారని వివరణ ఇస్తున్నారు. కాగా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వంలో మార్పు రావాలని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు.