జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామానికి చెందిన తవిటి వెంకటేష్ జనసేన కార్యకర్త. అతడు ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకటేష్ మరణవార్తను తూ.గో. జిల్లా జనసేన నేతల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే చలించిపోయి ఆర్థిక సాయం ప్రకటించారు.
సాధారణంగా జనసేన కార్యకర్తలకు పార్టీ ఇటీవల క్రియాశీలక సభ్యత్వంతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పించింది. దాంతో ప్రమాదాల్లో మరణించినవారి కుటుంబాలకు బీమా సొమ్ము లభిస్తుంది. అయితే తవిటి వెంకటేష్ పార్టీ తరఫున బీమా చేయించుకోలేదు. అయినా పవన్ కల్యాణ్ ఔదార్యం ప్రదర్శించారు. వెంకటేష్‌కు బీమా లేకపోయినా అతడి కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే చెక్కును అతడి కుటుంబ సభ్యులకు అందించనున్నారు.