విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ ఫోటోతో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోటోలు కూడా ఉన్నాయి. మరోవైపు ఫ్లెక్సీపై వంగవీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఫోటోలను కూడా పవన్ అభిమానులు ముద్రించారు. కాగా భీమ్లా నాయక్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్‌ల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.
