విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహసభలో ఆ పార్టీ నేత పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2018లో తాను అడుగు పెట్టగానే.. ‘బండి’ కదిలిందని… ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడంతో ఇక్కడ కూడా సోము బండి కదులుతుందన్నారు. ఏపీ ప్రజలు తెలియక ఫ్యాన్ స్పీడును 151కి పెంచేశారని.. ఎప్పుడైనా ఈ ఫ్యాన్ పడిపోవడం ఖాయమన్నారు. జగన్ హిందూవునని నమ్మించి ఓట్లేయించుకున్నారని ఆరోపించారు. ఏపీలో పలు చోట్ల ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనా పట్టించుకోలేదని.. రామతీర్ధంలో రాముని తల తీసేసినా వ్యక్తిని పట్టుకోలేకపోయారని మండిపడ్డారు. రథాన్ని చెక్క అంటూ ఓ మంత్రి కామెంట్ చేశారంటే ఏం అనాలో అర్థం కావడం లేదన్నారు.
Read Also: న్యూఇయర్ ట్రీట్.. ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్
తెలంగాణ కంటే ముందే ఏపీలోనే బీజేపీ ముందు అధికారంలోకి వస్తుందని పరిపూర్ణానంద స్వామి అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు-జగన్ ఇద్దరూ చారిత్రాక తప్పిదాలు చేశారని.. 2022 చివరికో.. 2023 ఆదిలోనో ఏపీ ప్రభుత్వం ఏమవుతుందో తానైతే చెప్పలేనన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేస్తే… కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ ఆత్మను ఏడిపించారని.. అదే చంద్రబాబును కన్నీళ్లు పెట్టించిందని పరిపూర్ణానంద ఆరోపణలు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెడితే… జగన్ మాతృభాషను జెరూసలెంలో తగులబెట్టారని… తెలుగు భాషను పట్టించుకోకుండా ఇంగ్లీష్‌ను జగన్ నెత్తిన పెట్టుకుంటున్నారని విమర్శించారు.
అఖండ సినిమా ఏమో కానీ.. ప్రధాని మోదీ అసలైన అఖండుడు అని పరిపూర్ణానంద ప్రశంసలు కురిపించారు. ఒవైసీని మోడీ-యోగి కలిసి బ్యాండ్ బజాయిస్తారని… అందుకు యూపీ నుంచి యోగి హైదరాబాద్ వరకు వస్తారన్నారు. మోడీ-యోగిని చూసి ఒవైసీ పారిపోవడం ఖాయమన్నారు. మందిరాలను నిర్మించడమే కాదు.. గుడిసెలను భవనాలుగా కూడా బీజేపీ మార్చగలదని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.