ఆ వైసీపీ మాజీ మంత్రి అనుచరులు నిజంగానే నాలుగున్నర ఎకరాల భూ కబ్జా చేశారా? లేక ఆ పేరుతో పొలిటికల్‌గా ఆయన్ని బుక్ చేయాలనుకున్న ప్రత్యర్థులు బుక్ అయిపోయారా? ఏకంగా సీఎం చంద్రబాబునే ఇన్వాల్వ్ చేసిన ఈ వ్యవహారంలో వాస్తవాలేంటి? స్పాట్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసిన అధికారులు ఏం తేల్చారు? ఏమని నివేదిక ఇచ్చారు…? అసలెవరా మాజీ మంత్రి? నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామసభలో ఇటీవల పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఆ సభకు హాజరైన ప్యాపిలి మండలం పోదొడ్డి రైతు రామచంద్ర సంచలన ఆరోపణలు చేశారు. గ్రామ సర్వే నంబర్ 120లో తన భార్య రమాదేవి పేరిట ఉన్న నాలుగున్నర ఎకరాల పొలాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనుచరులు కబ్జా చేశారని, అధికారులకు 32 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఎంకు కంప్లయింట్ చేశారు రామచంద్ర.
దీనిపై తక్షణం స్పందించిన సీఎం ఆర్డీవోను పిలిపించి విచారణకు ఆదేశించారు. ఇదంతా… సభా వేదిక మీదే జరగడం ఒకరకంగా సంచలనమైంది. బుగ్గన భూ కబ్జా చేశారని కొందరు, కాదు ఆయన్ని పబ్లిక్‌గా బుక్ చేయడానికి ప్రత్యర్థులు అలా ప్లాన్ చేశారా అని మరికొందరు ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రైతు రామచంద్ర మాత్రం ఆ భూమి 110 ఏళ్ల నుంచి తమ కుటుంబ ఆధీనంలోనే ఉందని వాదిస్తున్నారు. కానీ… అఫీషియల్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఆ భూమి మొత్తం కొండ ప్రాంతం. రైతు చెబుతున్నట్టు అసలు 120 సర్వే నంబరే ఆర్ ఎస్ ఆర్ లో లేదట. దానికి సంబంధించి మాన్యువల్ అడంగల్ సృష్టించుకుని ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టు రెవెన్యూ అధికారుల విచారణలో తేలిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు… ఇదే సర్వే నంబర్లో రామచంద్రకు నాలుగున్నర, ఆయన భార్యకు మరో నాలుగున్నర ఎకరాలున్నట్టు రికార్డ్‌లు సృష్టించేశారన్నది రెవెన్యూ అధికారుల మాట.
ఒకే కుటుంబంలోని వారికి 5 ఎకరాలకు మించి అసైన్డ్ భూమి ఉండకూడదన్న 2023 నిబంధనల మేరకు అతని భార్య పేరుతో ఉన్న పొలాన్ని కటిక వెంకటేశ్వరి పేరుతో అసైన్మెంట్ కమిటీలో తీర్మానం చేసి పంపారట. ఇక రామచంద్ర చెబుతున్న పొలం పక్కనే 108 సర్వే నెంబర్ ఉంది. అందులో బుగ్గన మేనల్లుడు నితిన్ రెడ్డికి చెందిన పొలం ఉందని, వశిష్ట మైనింగ్ పేరిట కంకర ఫ్యాక్టరీ ఉండేదని చెబుతున్నారు. ఈ క్రమంలో….తన భార్య పేరుతో ఉన్న భూమిని కలుపుకోడానికే వెంకటేశ్వరి పేరుతో అసైన్మెంట్ కమిటీలో తీర్మానించారన్నది బాధితుడి ఆరోపణ. ఇక తన అనుచరులు భూమి ఆక్రమించారన్న ఆరోపణలపై బుగ్గన రియాక్ట్ అయ్యారు. తమకు కావాల్సినంత ఆస్తి వుందని, ఎవరి భూమినో ఆక్రమించాల్సిన ఖర్మ పట్టలేదని అన్నారాయన. ఇక ఇదే సమయంలో మా నాయకుడిని బుక్ చేయడానికి ప్రయత్నించి టీడీపీ నేతలు విఫలమయ్యారంటూ మాజీ మంత్రి అనుచరులు హ్యాపీగా ఉన్నట్టు తెలిసింది.
ఈ వ్యవహారంపై సీఎం ఆదేశాలతో విచారణ జరిపి స్థానిక అధికారులు నివేదిక కూడా పంపారట. అసలు ఇక్కడ 120 సర్వే నెంబర్ అన్నదే లేదని, పైగా అప్పటికే రైతు రామచంద్రకు నాలుగున్నర ఎకరాలు కేటాయించినందున రూల్స్ ప్రకారం అదే ఫ్యామిలీలోని ఏ ఇతర సభ్యులకు ఇవ్వడానికి వీల్లేదని నివేదించినట్టు సమాచారం. అలాగే…కబ్జా అయిందని రామచంద్ర చెబుతున్న భూమిని వెంకటేశ్వరికి ఇస్తూ అసైన్మెంట్ కమిటీ తీర్మానించినా… దాని మీద జాయింట్ కలెక్టర్ సంతకం లేకపోవడంతో అది కూడా చెల్లదని కూడా తేల్చేశారు. దీంతో ఆ భూమి అటు రామచంద్ర భార్యకు గాని, ఇటు వెంకటేశ్వరికి గాని చెందే అవకాశమే లేదు. అదెలా ఉన్నా…మొత్తం మీద బుగ్గన అనుచరుల భూ ఆక్రమణ పేరిట జరిగిన డ్రామాను మాత్రం ఎవరికి వారు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.