పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు వైసీపీ సీటు వ్యవహారం ఉత్కంఠగా మారుతోంది. గడిచిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా వైసీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలో పడటం.. భారీగా ఎమ్మెల్యేలకు మెజార్టీ రావడంతో ఎంపీగా కృష్ణదేవరాయలు విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీకి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు రావచ్చట. దీంతో అధిష్టానం విషయాన్నీ గ్రహించి ఆయన్ను నరసరావుపేట నుంచి మారాలని చెబుతోందట. సిట్టింగ్ సీటును వదిలి వేసి.. గుంటూరులో పోటీ చేయాలని కోరిందట. అయితే తనను తొలిసారి గెలిపించిన నరసరావుపేటను వదిలేది లేదని భీష్మించు కూర్చున్నారట శ్రీకృష్ణదేవరాయలు. ఇదే విషయం ప్రస్తుతం పేట పరిసర నియోజకవర్గలలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది.
Read Also: Off The Record about Yanamala Brothers: యనమల సోదరుల మధ్య టికెట్ రగడ..!
2019 వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న శ్రీకృష్ణదేవరాయలు స్థానిక నాయకులతో కూడా చక్కగా కలిసి పనిచేశారు. తర్వాత పార్లమెంటు పరిధిలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలతో ఎంపీకి సఖ్యత లేదు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనితో ఎంపీకి పడటం లేదు. ఆ విషయం అనేకసార్లు రుజువైంది. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుమతి లేకుండా ఎంపీ కాలు పెట్టే పరిస్థఙతి కూడా లేదు. రజనీ ఎంపీ వర్గాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇక బ్రహ్మనాయుడు ఎంపీ పేరు చెబితే ఫైర్ అవుతున్నారు. ఇలాంటి గొడవలు ప్రస్తుతం పెద్ద ప్రమాదం కాకపోయినా.. ఎన్నికల్లో వేళ సీన్ మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఓడిన గుంటూరు సహా మూడు పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలవాలన్నది వైసీపీ ఆలోచన. అందుకే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పిందట అధిష్టానం. ముఖ్యంగా వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఎంపీకి వ్యతిరేకంగా ఓటుపడే ప్రమాదం ఉందనేది అధిష్టానం అనుమానం అట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బహిరంగంగానే మంత్రి విడదల రజనీకి, శ్రీకృష్ణదేవరాయలకు.. అదే విధంగా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు శ్రీకృష్ణదేవరాయలకు పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి. మీడియా ముఖంగా కామెంట్లు, గొడవలు చేసుకునే పరిస్థితికి కూడా వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి పోటీ చేస్తే ఆ రెండు సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉందనేది అధిష్టానం భయం అట. దీని నుంచి గట్టెక్కాలంటే ఎంపీను పేట వదిలి పెట్టక తప్పదు అనే ప్రచారం ఉంది. దీనిపై ఎంపీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రశ్న. రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్న కారణం తప్ప ఏ ఆరోపణ లేని ఎంపీగా మళ్లీ అక్కడే కొనసాగడానికి అధిష్ఠానాన్ని ఒప్పిస్తారా లేక హైకమాండ్ చెప్పిన మాట వింటారా అనేది సస్పెన్స్‌గా మారింది.
రాజకీయాల్లో గెలుపు కావాలంటే ఒకటి రెండు ఓట్లైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ ఫలితాలు చూసుకుంటే ఆ విషయం బోధపడుతుంది. కేవలం ఐదువేలలోపు ఓట్లతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గెలిచారు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు నష్టం చేయకున్నా.. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ల అనుచరులు క్రాస్ ఓటింగ్ చేస్తే అది వైసీపీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని అనుచరులతో చెబుతున్నారట. తన లెక్కలు తాను వేసుకుంటున్నారట. క్రాస్ ఓటింగ్ ప్రమాదం తనకు లేదని స్పష్టం చేస్తున్నారట. నరసరావుపేటలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఒకవేళ టిడిపి బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలి తనకు కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. సొంత పార్టీ వాళ్లు దెబ్బకొట్టినా ప్రత్యర్థి ఓట్ల చీలికతో బయటపడతా అంటున్నారట. అయితే ఒక ఎంపీ లెక్కల కంటే అధిష్ఠానం వేసే ఎత్తుగడలే ముఖ్యం. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎంపీ ఎలాంటి అడుగులు వేస్తారో అనే టెన్షన్ పల్నాడులో నెలకొని ఉంది.