1.2019-20కి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే… బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. ఆ పార్టీకి రూ.698.33 కోట్లు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో బీజేపీకి 69.37 శాతం ఆస్తులున్నట్లు నివేదిక పేర్కొంది.
2.బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్‌పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
3.ఏపీలో పీఆర్సీ వివాదం పీటముడి వీడడం లేదు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనల పై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం అన్నారాయన. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు.
4.కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు.
5.మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే అపోలో వైద్యులు నిత్యం ఆయనను పరీక్షిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. కాకపోతే కొద్దిగా జలుబు, ఒంటి నొప్పులు ఉన్నాయని, జ్వరం పూర్తిగా తగ్గినట్లు డాక్టర్లు తెలుపుతున్నారు. వైద్యుల సూచనలు మరియు సలహాలతో డైట్ ఫాలో అవుతూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా కోడలు ఉపాసన మామగారిని జాగ్రత్తగా చూసుకొంటున్నదట . అపోలో నుంచి వైద్యులను ఇంటికి పంపి చిరును జాగ్రత్తగా చూసుకోమని తెలిపినట్లు సమాచారం.
6.కరోనా మళ్లీ పంజా విసరడంతో.. అన్ని రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి.. కానీ, కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను అనుగుణంగా మళ్లీ ఆంక్షలను సడలిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా వైరస్ కేసుల కారణంగా మూసివేసిన తమిళనాడులోని స్కూళ్లు, కాలేజీలు ఫిబ్రవరి 1వ తేదీన తిరిగి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.
7.గ్రీన్ఇండియా చాలెంజ్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పద్మజారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం.చెట్లు నాటడం అంటే దైవకార్యం తో సమానం అని ఆమె అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా బేగంపేటలోని తన నివాసంలో డా.పద్మజారెడ్డి మొక్కలు నాటారు.
8.సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఒక డిజిటల్ మీడియా కంపెనీకి అధినేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సదరు సంస్థ తెలుగు సినిమాలు డిజిటల్ రైట్స్ కొని వాటిని యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల అలా కొనుగోలు చేసి విడుదల చేసిన ఒక సినిమాలోని సన్నివేశంలో గౌడ కులానికి చెందిన మహిళలను ఇబ్బందికర పరిస్థితుల్లో చూపించారు అంటూ గౌడ సంఘానికి చెందిన కొంతమంది రామ్ ఆఫీస్ కి వెళ్లి, అతనితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
9.జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గత యేడాదిన్నరగా ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి జనవరి 28న జనం ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకుడు కావడం విశేషం.
10.ఫిబ్రవరి తొలివారంలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం ఇరు జట్లను సెలక్టర్లు ప్రకటించారు. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కు విభేదాలు తలెత్తాయి. ఆల్‌రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షపూరితంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెస్టిండీస్ జట్టులో లుకలుకలు బహిర్గతం అయ్యాయని విండీస్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.