ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఇప్పటికే కొలికపూడి ఒకసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. రేపు ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తప్పవన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై.. టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొలికపూడి తీరుపై సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యేగా కొలికపూడి ప్రజా సమస్యల పరిష్కారం కంటే ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా వివాదాస్పదంగా మారారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎ.కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఓ ఇంటిని ఎమ్మెల్యే జేసీబీతో కూల్చివేయించారు. ఆ సమయంలో కారుపై కూర్చుని ఆందోళనలకు దిగడం వివాదానికి దారి తీసింది.
Read Also: Bhatti Vikramarka : ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోంది
ఆ తర్వాత చిట్యాలలో సర్పంచ్ ను ఎమ్మెల్యే తిట్టారని వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీంతో అప్పట్లోనే కొలికపూడిపై అధిష్టానం సీరియస్ అయింది. ఇదే సమయంలో కొలికపూడి కూడా తిరువూరులో ర్యాలీ పెడుతున్నట్లు ప్రకటన చేయడం మరింత చర్చకు దారి తీసింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని ర్యాలీని విరమింపజేసింది. తాజాగా ఈనెల 11న గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు కొలికపూడి. గ్రామంలో రాంబాబుకు ఆయన సోదరుడు వైసీపీ నేత భూక్యా కృష్ణకు మధ్య చాన్నాళ్లుగ ఆస్తి తగాదాలు ఉన్నాయి. గ్రామంలో ఇటీవల వేసిన సీసీ రోడ్డు తన స్థలంలో వేశారని.. వివాదం తేలేవరకు రోడ్డును ఎవరూ వినియోగించకూడదని, దానిపై కంచె వేశారు కృష్ణ. రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇక ఎమ్మెల్యే వర్గం తనపై, తన భర్తపై దాడికి పాల్పడ్డారంటూ కృష్ణ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో ఈ ఘటనతో మరోసారి కొలికపూడి తీరుపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ ఘటనపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. రేపు క్రమశిక్షణా కమిటీ ముందుకు రానున్నారు. అయితే రేపు అధిష్టాం ఏం చర్యలు తీసుకోబోతుంది.. క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి ఎలాంటి వివరణ ఇస్తారు.. ఆ వివరణకు అధిష్టానం సంతృప్తి చెందుతుందా అనేది చూడాలి.
Read Also: Road Accidents: తెలంగాణలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి తీవ్ర గాయాలు