Andhra Pradesh Winter: దక్షిణ భారతదేశం మొత్తం చలి విజృంభిస్తోంది. దీంతో సాధారణం కంటే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చలి తీవ్రస్థాయిలో ఉంది. చింతపల్లిలో ముఖ్యంగా 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు హుకుంపేటలో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏజెన్సీలోని లంబసింగి వంటి కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయి. రేపు, ఎల్లుండి కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Thunivu: మీరు సినిమాలకి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు…
అటు తెలంగాణలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ సీజన్‌లో ఎన్నడూ చూడనంతగా చలి తీవ్రత రాబోయే రోజుల్లో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరభారతదేశంలో వీస్తున్న చలి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవచ్చని తెలిపింది. జనవరి 11 వరకు చలి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. కాగా చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణిలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు స్వెటర్లు ధరించాలని.. రాత్రిపూట, తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవడమే మంచిదని హితవు పలుకుతున్నారు.