కోనసీమలో క్రాప్ హాలీడేపై అధికారులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. దాంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. గత ఏడాది ఇచ్చినట్లే హామీలు ఇచ్చి అమలు చేయకపోతే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రైతులు చెబుతున్నారు. దాంతో కోనసీమలో సాగుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలో దాదాపు 12 మండలాల్లో రైతులు ఈ ఏడాది సాగు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా డ్రైన్లు సమస్యతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో వర్షాలు ఎక్కువగా పడతాయి వర్షపు నీరు మొత్తం పొలాల్లో నిలవడంతో అన్నదాతలకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి.
డ్రెయిన్ల పూడిక సంబంధించి గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అప్పుడు కూడా అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తప్ప అది అమలుకు నోచుకోలేదు ఇప్పుడు కూడా సేమ్ డైలాగ్ చెప్తున్నారు కానీ రైతులకు నమ్మకం కుదరడం లేదు. క్షేత్రస్థాయిలో డ్రైన్లు సమస్యను ఉన్నతాధికారులు పరిశీలించాలని రైతులు వేడుకుంటున్నారు. తూతూమంత్రంగా పనులు చేయడం వల్ల ఉపయోగం ఉండదని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు పంటకి వేలల్లో పెట్టుబడి పెట్టడం వలన తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నారు.
గత సీజన్లో కూడా రైతులకు అధికారుల నుంచి ఇటువంటి హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్య వచ్చినా తాము పరిష్కారం చేస్తామని రైతులు నిర్భయంగా పంట వేసుకోండి అని ప్రచారం చేశారు. కానీ తీరా రైతులు పంట వేశాక అధికారులు అడ్రస్ లేకుండా పోయారు. కొంత మంది అన్నదాతలు కనీసం పెట్టుబడి డబ్బులు కూడా వచ్చిన పరిస్థితి లేకుండా పోయింది. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయింది.
ఈసారి 12 మండలాల్లో రైతులు ఏకతాటిపై వచ్చారు. పూర్తిస్థాయిలో డ్రైన్లను ఆధునీకరించి వర్షపు నీరు వెళ్ళేలా ఉంటేనే తాము సాగుకు సిద్ధం అవుతారని చెబుతున్నారు.. ఆ సమస్య పరిష్కారం దిశగా పనులు మొదలు పెడితే తాము ముందుకు రాగలమని అని అంటున్నారు. తమ కష్టం పెట్టుబడి వృధాగా పోతుంటే ఇక వ్యవసాయం చేసి ఉపయోగమేముంది అనేది రైతుల వాదన. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పనులు ప్రారంభించాలి. రైతులు సాగు చేయకపోవడం వల్ల కూలీలు కూడా పని దొరికే అవకాశం లేదు. పంట డబ్బులు త్వరగా ఇవ్వడం, రైతులుకి పనులు ఉన్న టైం లో ఉపాధి పనులు లేకుండా చేయాలని చెబుతున్నారు. మొత్తానికి అన్నదాతలు క్రాప్ హాలీ డే పై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు గత ఏడాది ఇచ్చినట్లే హామీలు ఇస్తున్నారు. పనులు ప్రారంభంపై సస్పెన్స్ కొనసాగుతుంది.. మరి సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపుతారో చూడాలి.
Delta Farmers: ఖరీఫ్ వేళ.. డెల్టా రైతులకు కొత్త కష్టాలు