నెల్లూరుకు చెందిన అకరపాక సురేష్ అనే దివ్యాంగుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనను చెడు వ్యసనాల నుంచి కాపాడింది, సమాజంలో వెక్కిరింపుల నుంచి గౌరవప్రదంగా నిలబెట్టింది అయ్యప్పస్వామి అని దివ్యాంగుడు బలంగా నమ్మాడు. దీంతో ఏకంగా 750 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 20న నెల్లూరు పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అమ్మ వారి ఆలయంలో ఇరుముడి కట్టుకుని పాదయాత్రగా బయలుదేరిన సురేష్.. కరోనా కాలంలోనూ ఎన్నో వ్యయ ప్రయాసలను ఎదుర్కొని ఈనెల 4న శబరిమలకు చేరుకున్నాడు.
Read Also: టీటీడీకి కేంద్రం బ్యాడ్ న్యూస్… భారీ మొత్తంలో ఆగిపోయిన విరాళాలు
అయితే ఎవరి సహకారం లేకుండా ఒంటికాలితోనే ఊతకర్ర సహాయంతో 105 రోజుల పాటు సురేష్ 750 కి.మీ. నడవడం చర్చనీయాశంగా మారింది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభించి ఎండ పెరిగే సరికి ఏదో ఒక ఆలయానికి చేరుకుని… అక్కడ సేద తీరి భిక్ష చేసిన అనంతరం సురేష్ మళ్లీ పాదయాత్ర చేపట్టేవాడు. రాత్రిపూట దగ్గరలోని ఆలయంలో బసచేసేవాడు. కాగా సురేష్ గతంలో ఎన్నోసార్లు అయ్యప్ప దీక్ష తీసుకోగా… శబరిమలకు నడిచివెళ్లడం ఇది రెండోసారి కావడం గమనార్హం.