సమాజంలో స్త్రీకి రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తోడబుట్టిన అక్క చెల్లెళ్లకే కాదు, జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా అండగా నిలవడం మన కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెబుతోందని.. కానీ ఈ రోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవారే మహిళలతో అగౌరవంగా మాట్లాడుతుండటం మన దురదృష్టమన్నారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇకపై ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఒక అన్నగా స్పందిస్తానని ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి చెల్లికి నేను హామీ ఇస్తున్నానని వివరించారు. అంతేకాదు ఏపీలో ఇప్పటివరకు ఉన్మాదుల దుశ్చర్యలకు బలైపోయిన ప్రతి ఆడపిల్లకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.