మా అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు.. మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వేయాలంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఉచ్ఛ నీచాలు మరచి వైసీపీ నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే పోలీసులు కనీసం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. జిల్లాలు దాటి మరీ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అంటూ విమర్శలు గుప్పించారు. పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు, బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారని సవాల్ చేస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు తమ ప్రతాపాన్ని ఎందుకు చూపడం లేదో..? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడితే కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారని ఆయన అన్నారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.