అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను నందమూరి కుటుంబసభ్యులు కలిశారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరు పెడతానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నందుకు నందమూరి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో మంత్రి కొడాలి నానితో పాటు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళి, పలువురు స్ధానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వారు జ్ఞాపికను బహూకరించారు.
మరోవైపు నిమ్మకూరు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో కోటి రూపాయల విలువైన పైపులైన్‌లు దెబ్బతిన్నాయని.. మంచినీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని వివరించారు. వాటికి నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. దీంతో వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నిమ్మకూరులో ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఖర్చుకు వెనుకాడకుండా వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.