ఏపీ రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై పలువురు ప్రముఖులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తన స్వంత యూట్యూబ్ ద్వారా మాట్లాడుతూ ” చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానం చాలా దారుణం.. ఆయన ఏడవడం నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఆయన పాలనలో ఉన్నప్పుడు విమర్శించాను.. కానీ అవన్నీ రాజకీయంగానే ఉన్నాయి.. నేను జన సైనికుడిని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో చేస్తున్న సైనికుడిగా మాట్లాడుతున్నా.. పార్టీల పరంగా టీడీపీ, వైసీపీ అని లేకుండా తప్పు ఉంటే ఎత్తి చూపుతాం.. అంతేకాని ఇలా కుటుంబాన్ని దూషించడం చాలా అన్యాయం.. ఇదంతా ఆంధ్రప్రదేశ్ విడిపోయాకే మొదలయ్యింది.
గతంలో ఇలాగే వైసీపీ వారిని కొంతమంది పరుష పదజాలంతో దూషించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్ వాళ్ళు వారికి బుద్ధి చెప్పారు. అప్పుడు జగన్ కూడా ఇలాగే బాధ పడ్డాడు. అప్పుడు కూడా జగన్ కి ఇలా జరగకుండా ఉండాల్సింది అని బాధపడ్డాను. మా అన్న పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాగే దూషించారు. దయచేసి అందరికి చెప్తున్నా.. వ్యక్తిగతంగా దూషించడం మానేయండి.. చంద్రబాబు పాలనలో అవినీతి ఎండగట్టండి. కానీ కుటుంబ మహిళలపై దూషించడం చెడ్డ సంప్రదాయం అని పేర్కొన్నారు.