Nadendla Manohar: చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం.. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తాం.. మాన, ప్రాణాలను తోడేస్తామన్న రీతిలో ఆదివారం రాత్రి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రవర్తించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన బీభత్స కాండ వైసీపీ సర్కారు ఆలోచన విధానాన్ని, దుర్నీతిని ప్రపంచానికి మరోసారి వెల్లడి చేస్తోందని ట్విట్టర్‌లో నాదెండ్ల మనోహర్ ఓ పోస్ట్ పెట్టారు.
Read Also: Kurnool Live: కర్నూలులో రాయలసీమ గర్జన లైవ్ అప్‌డేట్స్
మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రైతు సభను నిర్వహించాలనుకోవడం రామచంద్ర యాదవ్ చేసిన నేరమా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు పెట్టుకోవడం ఈ ప్రాంతంలో నిషిద్ధమా అని నిలదీశారు. రైతు సభకు అనుమతి లేదన్న అధికారులు రామచంద్రయాదవ్ ఇంటిపై కిరాయి మూకలు దాడులు చేస్తుంటే సకాలంలో ఎందుకు ఆపలేకపోయారని సూటి ప్రశ్న వేశారు. ఇది ముమ్మాటికీ అధికారపక్షం చేస్తున్న వికృత రాజకీయంలో భాగమేనని ఆరోపించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పుంగనూరులో పోటీ చేసిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ప్రశ్నించేవారు, తమను వ్యతిరేకించేవారు, బలంగా పోటీ చేసే వారు లేకుండా చేసుకునే కుట్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.
పుంగనూరు దాడి… వై.సి.పి. సర్కారు దుర్నీతి – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/lfIBga6lqz
— JanaSena Party (@JanaSenaParty) December 5, 2022