కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెడుతున్నారని ఇటీవల తీవ్రస్థాయిఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, బీసీ, కాపు కులాలకు ముద్రగడ రాసిన లేఖ కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలు పంపింది. ఏపీలో తక్కువ జనాభా కలిగిన వర్గాల వారు అధికారం అనుభవిస్తున్నారని… ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలని లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. ఎప్పుడూ పల్లకి మోయడం కాదని.. మనం పల్లకిలో కూర్చునేలా ఆలోచన చేయాలని ఆయన సూచించారు.
Read Also: జగన్ మళ్లీ సీఎం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ధర్మాన
పల్లకిలో కూర్చునవారికి మన జాతులు బజారులో కొనుగోలు చేసే వస్తువుగా అభిప్రాయపడుతున్నారని… పల్లకిలు మోయించుకుని అవసరం తీరాక పశువుల కన్నా మన జాతుల్ని హీనంగా చూస్తున్నారన్న సంగతి మీకు తెలియనిది కాదంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నాడు. మన జాతుల్ని గడ్డిపరక అని చాలా మంది భావిస్తున్నారని… గడ్డిపరకకి విలువ ఉండకపోవచ్చేమో కానీ అదే మెలివేస్తే ఏనుగును కూడా బంధించవచ్చనే సంగతి గుర్తుపెట్టుకోవాలని ముద్రగడ హితవు పలికారు. రాజ్యాధికారం కోసం ఎస్సీ, బీసీ, కాపులు కలిసి బ్లూప్రింట్ తయారుచేద్దామని ముద్రగడ సూచించారు. రాజ్యాధికారం కోసం మన ప్రయత్నాలు చాపకింద నీరులా, భూమి లోపల వైరింగ్‌లా ఉండాలని కోరారు. కాగా ముద్రగడ తాజాగా రాసిన లేఖతో త్వరలో ఆయన పార్టీ ఏర్పాటు చేస్తారనే విషయంపై క్లారిటీ వచ్చేసినట్లు కనిపిస్తోంది.