విజయవాడ టీడీపీలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని… ఎంపీ నాని అధిష్ఠానానికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నాని అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. టీడీపీ అధిష్టానం కూడా దీనిపై వ్యాఖ్యానించలేదు. అయితే పార్టీలోని అంతర్గత గొడవలతోనే నాని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే…పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మేయర్ సీటు విషయంలో కేశినేని నానితో కొందరు నేతలు విభేదించారు. ఈ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు… విస్త్రత చర్చకు కారణమయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నానిపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. అధిష్టానం సూచనతో… నాటి గొడవ తాత్కాలికంగా సద్దు మణిగింది. ఆ తరువాత కూడా పార్టీ పెద్దలు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టలేదు. ఎన్నికల్లో ఓటమితో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. నాటి వ్యాఖ్యలపై తీవ్ర మనస్ధాపం చెందిన కేశినేని… అప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎంనీగా మాత్రం తన విధులు నిర్వహిస్తున్నారు.
అయితే, నాటి వివాదంపై అదిష్టానం వైఖరితో అసంతృప్తిగా ఉన్న నాని… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, కృష్ణా జిల్లా పార్టీలో గొడవలు ఈనాటివి కావు. అధికారంలో ఉన్నప్పుడు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే గొడవ నడుస్తోంది. ఎంపీతో… గద్దె రామ్మోహన్‌కు తప్ప ఇతర నేతలకు పొసగడం లేదు. గత ఎన్నికల సమయంలో నాని పోటీకి నిరాకరించారు. అదిస్టానం జోక్యంతో ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. మరి నాని అలకను పార్టీ పరిష్కరిస్తుందా..లేక అలా వదిలేస్తుందో వేచి చూడాలి.