ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది. ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో మూడుస్థానాలు ఆ పార్టీకి దక్కనున్నాయి. ప్రస్తుత మండలిలో 14 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు…స్థానిక సంస్థల కోటాలో 11 మందిని భర్తీ చేయాలి. అందులో తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో ముగ్గురి నియామకానికి షెడ్యూల్ విడుదల చేసింది.
అందులో వైసీపీ నుంచి డీసీ గోవిందరెడ్డి..టీడీపీ నుంచి మాజీ ఛైర్మన్ మహమ్మద్ షరీఫ్…బీజేపీ నుంచి సోము వీర్రాజు పదవీ విరమణ చేసారు. స్థానిక సంస్థల కోటాలో 11 మందికి సంబంధించిన లిస్టు కూడా వైసీపీ అధినాయకత్వం సిద్దం చేసిందని తెలుస్తోంది. ఈ 14 మంది వైసీపీ నుంచి సభలో ఎంట్రీ ఇస్తే.. మొత్తం 58 మంది సభ్యులు ఉన్న ఏపీ శాసన మండలిలో 32 స్థానాల తో వైసీపీ అటు శాసన సభలో..శాసన మండలిలో పూర్తి మెజార్టీతో నిలుస్తుంది.
ఇప్పటికే మండలి ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఈ ఎన్నికల తరువాత ఈ రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు స్థానాలు వైసీపీ వశం కానున్నాయి. మండలిలో బలం పెరిగితే జగన్ ప్రభుత్వానికి ఏ బిల్లుల విషయంలోనైనా తిరుగులేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదవులు దక్కనివారికి పదవులు లభించే అవకాశం వుందంటున్నారు.