MLA Malladi Vishnu Fires On Pawan Kalyan Over Volunteer Comments: వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో అగ్గి రాజేశాయి. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు. పవన్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. అటు.. మహిళా కమిషన్ ఇప్పటికే నోటీసులు పంపింది. మరోవైపు.. వైసీపీ నేతలు సైతం పవన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. సేవా దృక్పథంతో పని చేస్తున్న వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని మండిపడుతున్నారు.
ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. వారాహి యాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, పవన్ కళ్యాణ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ తరఫున చేపట్టిన తన వారాహి యాత్రలో భాగంగా.. పవన్ కళ్యాణ్ తన పార్టీ విధివిధానాల గురించి చెప్పుకోవాలి కానీ, ఇలా ఇతరులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని ధ్వజమెత్తారు. సేవా దృక్పథంతో పని చేస్తున్న వాలంటీర్లపై పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందనడం దిగజారుడుతనమని మండిపడ్డారు. అసలు పవన్‌కు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తేల్చి చెప్పారు. ఏ ఆధారాలతో పవన్ వాలంటీర్లపై ఆరోపణలు చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నాడని, ఆయన రాసిచ్చిన స్క్రిప్టునే చదువుతున్నాడని అన్నారు. పవన్‌కు మామూలుగానే తిక్క ఉందని, ఆ తిక్కతోనే వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశాడని విమర్శించారు. పవన్ తక్షణమే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు.