AP Bifurcation Bill: ఈనెల 27న ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏపీ విభజన చట్టం అమలుపై చర్చించనుంది. ఈ సమావేశం ఏజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈనెల 27న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏడు అంశాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్‌ల విభజన, షెడ్యూల్ 10లోని సంస్థల విభజన, చట్టంలో లేని ఇతర సంస్థల విభజన, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన, ఏపీ ఎస్సీ ఎస్సీఎల్, టీఎస్సీఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014- 15 రైస్ సబ్సిడీ విడుదల ఉన్నాయి.
Read Also:Santosh Kumar: ఆసియాలోనే రెండో అతిపెద్ద మర్రిచెట్టు పరిరక్షణకు నడుం బిగించిన టీఆర్ఎస్ ఎంపీ
ఏపీకి సంబధించిన ఏడు అంశాలను పరిశీలిస్తే.. నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు, ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, పన్ను మదింపులో పొరపాట్ల సవరణ, నూతన విద్యాసంస్థల ఏర్పాటు, నూతన రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు వంటివి ఉన్నాయి. అయితే మూడు రాజధానుల అంశం కేంద్ర హోంశాఖ అజెండాలో లేకపోవడం ఆసక్తికరంగా మారింది. కేవలం కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే పేర్కొనడంతో కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా కేంద్ర ఆర్ధికశాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు 9 శాఖల అధికారులు కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశానికి హాజరుకానున్నారు.