Vidadala Rajini: ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 2023 నాటికి ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. రూ. 700 కోట్లతో ఉద్దానంలో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచినీటి పథకం 80 శాతం పూర్తయిందని.. రక్షిత మంచి నీటి పథకాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఉద్ధానం కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి విడదల రజినీ ప్రశ్నించారు. బీసీల ద్రోహి చంద్రబాబు అని.. బీసీలను ఆయన కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. బీసీల్లో చంద్రబాబు ఉనికి కొల్పోతున్నారని పేర్కొన్నారు.
అటు ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిని త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తామని మంత్రి విడదల రజినీ తెలిపారు. వైద్య శాఖలోని ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయని.. సీఎం జగన్ ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తామని మంత్రి విడదల రజినీ చెప్పారు. వికేంద్రీకరణ పద్ధతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Read Also: Vijaya Sai Reddy: బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు ఇవ్వాలి
మరోవైపు ఉద్ధానం సమస్యను గత ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్ధానంలో కిడ్నీ బాధితుల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల ఆస్పత్రిని మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 78 శాతం మెడికల్ రీసెర్చ్ ఆస్పత్రి పనులు పూర్తి చేశామన్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న ప్రతి ఒక్కరికీ రూ.10వేలు చొప్పున పెన్షన్ ఇస్తున్నట్లు మంత్రి అప్పలరాజు చెప్పారు.