కోనసీమ జిల్లాకు డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రభుత్వం ప్రకటించడంపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కోనసీమ దళితుల ఆకాంక్ష నెరవేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం అని కొనియాడారు. దళితులు, మేధావులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, కోనసీమ దళిత ప్రజాప్రతినిధులు కోరిన విషయాన్ని మంత్రి గోపాలకృష్ణ గుర్తు చేశారు. వారి విజ్ఞప్తులను సీఎం జగన్ స్వీకరించి అందరికీ సమానుడైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును కోనసీమకు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని… దళితులంతా సంబరాలు జరుపుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. కోనసీమ జిల్లా పేరు మార్పు
బీసీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కృష్ణయ్యకు రాజ్యసభ సీటిస్తే చంద్రబాబు అవమానించారని మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఆర్.కృష్ణయ్యను చంద్రబాబు వంచిస్తే జగన్ రాజ్యసభ సీటిచ్చి గౌరవించారన్నారు. తన హయాంలో ఒక్క బీసీకీ రాజ్యసభ అవకాశం చంద్రబాబు ఇవ్వలేదన్నారు. తెలంగాణ నేతలకు సీట్లు ఇచ్చారని, అమ్ముకున్నారని చంద్రబాబు ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కేవలం కంటగింపు, బాధతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బీసీలకు రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల బీసీలందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
కాగా మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడ్డట్టు కొన్ని ఛానళ్లలో చూపిస్తున్నారు తప్ప నిజానికి జనం తిరగబడటం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంత మంది పౌరులకు ప్రభుత్వం నుంచి ఏం వస్తుంది, ఏం పొందాలి అనే విషయాలపై అవగాహన రాహిత్యం ఉందని.. అందువల్ల కొందరు ప్రజలు మన ఎమ్మెల్యేనే కదా అని అడిగే విధానంలో తేడా ఉంటోందని.. కొందరు ఆగ్రహంతో మాట్లాడుతుండటాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.