Minister Roja: గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని.. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అంటూ విమర్శలు చేశారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలోనూ 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు మరో 11 మంది బలయ్యారని రోజా అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి 40 మందిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడంలేదని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనిపించడం లేదా అని.. పవన్ తన నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా అంటూ నిలదీశారు.
Read Also: CPI Raja: ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి.. దేశ సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయి
అటు లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని మంత్రి రోజా అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ విడుదల చేయగానే 11 మంది చనిపోయారని.. లోకేష్ పాదయాత్ర చేస్తే టీడీపీకే నష్టం అని రోజా ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర పట్ల టీడీపీ నేతలే భయపడుతున్నారని చురకలు అంటించారు. మరోవైపు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపైనా మంత్రి రోజా స్పందించారు. ఎక్కడైనా, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని.. పోటీ చేయవచ్చని తెలిపారు. ఓటుకు నోటు కేసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏపీకి తీరని నష్టం చేశారని.. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినా దానిని చంద్రబాబు ప్రశ్నించలేదన్నారు. ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదని.. చట్టప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధులపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.