Hindupuram YSRCP Conflicts: ఏపీలో అధికార పార్టీ వైసీపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. హిందూపురంలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2014 ఎన్నికల్లో హిందూపురంలో పోటీ చేసిన నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల హిందూపురం ప్రెస్ క్లబ్ వేదికగా రెండు వర్గాల నేతలు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా వైసీపీ పెద్దల వద్దకు చేరింది. మంగళవారం నాడు హిందూపురం వైసీపీ నేతలు అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
హిందూపురంలోని ఇరు వర్గాల నేతలను పిలిచి జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి ఎదుటే ఒకరిపై ఒకరు రెండు వర్గాల నేతలు ఆరోపణలు గుప్పించుకున్నారు. పెద్దిరెడ్డి మందలించడంతో ఇరువర్గాల నేతలు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా ఇక్బాల్ వర్గంపై నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. హిందూపురం సమన్వయకర్తగా ఇక్బాల్‌ను కొనసాగిస్తే తాము పనిచేయలేమని మంత్రి పెద్దిరెడ్డికి స్పష్టం చేశారు. అటు తనపై నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ వర్గాలు మూకుమ్మడిగా ఫిర్యాదు చేయడం ఎమ్మెల్సీ ఇక్బాల్ అసహనానికి గురయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తే తాను హిందూపురం నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమేనని తెలిపారు.
Read Also:Andhra Pradesh: అగ్ర స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మరికొద్ది రోజుల్లో 10 కోట్ల మార్క్..
గత మూడేళ్లుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ చేస్తున్న వ్యవహారాలన్నీ పార్టీ దృష్టికి తీసుకుని వస్తూనే ఉన్నామని హిందూపురం నియోజకవర్గం మాజీ ఇంఛార్జ్ నవీన్ నిశ్చల్ తెలిపారు. ఎల్లుండి ముఖ్యమంత్రి నేతృత్వంలో సత్యసాయి జిల్లా సమీక్ష ఉందని.. ఈ సమీక్ష సమయంలో తాము చెప్పిన విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళతానని పెద్దిరెడ్డి చెప్పారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. తాను స్థానికుడిని అని.. ఓటర్ల పల్స్ తనకు తెలుస్తాయా? కర్నూలు నుంచి వచ్చిన ఇక్బాల్ కు తెలుస్తాయా అని నవీన్ నిశ్చల్ ప్రశ్నించారు. తనపై కూడా ఇక్బాల్ అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించాడని ఆరోపించారు. పార్టీలోని ముఖ్య నాయకులు అందరిపై అక్రమ కేసులు పెట్టించాడన్నారు. నూటికి వెయ్యి శాతం తనతో పాటు ముఖ్యమైన నేతలందరి కాల్ డేటా వన్ టౌన్ సీఐ ఇస్మాయిల్ ఇక్బాల్‌కు ఇస్తున్నాడని నవీన్ నిశ్చల్ విమర్శలు చేశారు. నాన్ లోకల్ వద్దని.. లోకల్ వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలన్నదే తమ అభ్యర్థన అని ఆయన తెలిపారు.