ఏపీలో అటవీ భూముల ఆక్రమణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు విజయవాడలో క్యాంప్ కార్యాలయలో అటవీ, రెవెన్యూ, సర్వే, సెటిల్ మెంట్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జగనన్న భూహక్కు-భూరక్ష కింద సర్వే జరుగుతోందని.. సర్వే చేసే క్రమంలో ఆక్రమణకు గురైన అటవీభూములను నిర్ధిష్టంగా గుర్తించాలని అధికారులకు సూచించారు. చట్టప్రకారం అటవీ భూములకు సర్వే నెంబర్లు ఇవ్వకూడదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Vijaya Sai Reddy: పబ్లిక్ స్థలాల్లో అన్నా క్యాంటీన్‌లు పెట్టి రచ్చ చేస్తారేంటి?
చిత్తూరు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని.. సెటిల్ మెంట్ ఆఫీసర్ల పేరుతో భారీగా బోగస్ పట్టాలను పొందారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. భూసర్వే ద్వారా ఆక్రమిత భూములకు సర్వే నెంబర్లు పొందాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆక్రమణలను రెగ్యులర్ చేసుకునేందుకు జరిగే ప్రయత్నాలను నిలువరించాలని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. తప్పుడు ధ్రువీకరణలతో అటవీ భూముల్లో పొందిన పట్టాలను రద్దు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో సర్వే వినతులపై నోడల్ అధికారులను నియమించాలని పేర్కొన్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల సరిహద్దులు కూడా నిర్ధిష్టంగా గుర్తించాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.