డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ పై నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. మాజీ ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ వంటి వారికి నచ్చడం లేదేమో..? మాజీ ఐఏఎస్ ఎస్సార్ శంకరన్ పేదల కోసం ఏం చేశారో గమనించాలి.
ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ పేదలను అగర్భ శత్రువులుగా చూస్తున్నారు. ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ వంటి వారు ఎస్సార్ శంకరన్ ను ఆదర్శంగా తీసుకోరా..? చంద్రబాబును అధికారంలోకి తేవాలనే భావనే ఎల్వీ, పీవీ రమేష్ మాటల్లో కన్పిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే.. సంక్షేమ పథకాలను నిలిపేస్తారనే భావం కలుగుతోంది.
పేదలకు న్యాయం చేస్తుంటే ఎల్వీ, పీవీ రమేష్ ఓర్వలేకపోతున్నారు. ఐఏఎస్ అధికారులను ముందుంచి చంద్రబాబు మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు అప్పులు చేస్తుంటే ఎల్వీఎస్, పీవీ రమేష్ ఏం చేస్తున్నారు..? కులుకుతున్నారా..? సంక్షేమ పథకాలు వద్దని చంద్రబాబు బయటకు వచ్చి చెప్పగలరా..? చంద్రబాబు హయాంలో అభివృద్ధి ఏం జరిగింది..? అని ప్రశ్నించారు నారాయణస్వామి. ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు పూర్తి చేశారా..? ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేసి నీళ్లివ్వగలిగారా..?
ధర్మపోరాటం పేరుతో నల్ల చొక్కాలతో చంద్రబాబు పెట్టిన ఖర్చెంత..? నేను జగన్ కాళ్లకు నమస్కారం పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట.. ఎక్కువ అన్నం తింటే జీర్ణం కాదు. పేదలకు సీఎం జగన్ చేసే మంచి పనులు చూసి వయస్సును కూడా పట్టించుకోకుండా పాదాలకు దండం పెట్టా. నేను జగన్ కాళ్లకు మొక్కడాన్ని ఎవరైనా తప్పు పడితే.. వాళ్ల ఖర్మ. మంత్రి పదవి ఇవ్వకున్నా.. జగన్ కాళ్లకు మొక్కేవాడిని అన్నారు నారాయణస్వామి.
Read Also: Palvai Rajani Kumari : టీఆర్‌ఎస్ నేతలు లైసెన్స్డ్ గుండాలుగా వ్యవహరిస్తున్నారు
స్కావెంజర్సుకు జీతాలు పెంచితే.. కొందరు కేబినెట్‌లో అభ్యంతరం పెట్టారు.. కానీ జగన్ పట్టు పట్టి ఇచ్చారు. స్కావెంజర్స్ చేసే పని ఎవ్వరైనా చేయగలరా..? మనం చేయలేం కదా..? అని జగన్ అన్నారు. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదు. నేనేం ఎగ్రెసివ్ గా మాట్లాడ్డం లేదు.. ఆవేదనతో మాట్లాడుతున్నానన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.