Kottu Satyanarayana: ఏపీలో గణేష్ మండపాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఫైర్ సేఫ్టీ కోసం రూ.500, మైక్ పర్మిషన్ కోసం రోజుకు రూ.100 చలానా రూపంలో కట్టాలని.. ఈ నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయని.. కొత్తగా పెట్టిన నిబంధనలు కాదని స్పష్టం చేశారు. కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే గణేష్ మండపాల ఏర్పాటుకు ఈ నిబంధనలు వర్తిస్తాయని.. గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదని తెలిపారు. దేవుడితో చెలగాటం ఆడొద్దని ప్రతిపక్షాలను హెచ్చరించారు.
Read Also: Pawan Kalyan: పర్యావరణంపై ప్రభుత్వానికి ఇప్పుడే ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది?
మరోవైపు ఏపీ వ్యాప్తంగా వినాయక మండపాలపై ఎలాంటి ఆంక్షలు లేవని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారం నమ్మవద్దని సూచించారను. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసులకు సహకరించాలని.. నిమజ్జనాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనవసరంగా వివాదాలు సృష్టిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.