ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు, టీడీపీకి లేదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. పేదలు బాగుండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ బెల్ట్ షాపులు రద్దు చేశారని తెలిపారు. అధికారంలో నుంచి దిగిపోయే ముందు బార్లకు ఐదేళ్లు లైసెన్సులు ఇచ్చిన ఘనత చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో సంభవించిన సహజ మరణాలను కూడా అక్రమ మద్యం మరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఆడవాళ్లను అడ్డం పెట్టుకున్న సన్నాసి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభకు అడ్డం పడుతోన్న టీడీపీ సభ్యులను బయటకు పంపాలని స్పీకర్‌ను మంత్రి కొడాలి నాని కోరారు.
మరోవైపు చంద్రబాబు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కామెంట్ చేశారు. సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. సస్పెన్షన్ కోసమే టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వస్తున్నారని పేర్కొన్నారు. సభను అడ్డుకోవడం టీడీపీకి పరిపాటిగా మారిందని మంత్రి కన్నబాబు ఆరోపించారు. ఇంటికో బెల్ట్ షాప్ పెట్టిన చరిత్ర చంద్రబాబుది అని.. టీడీపీ వాళ్లు ఇప్పుడు వేదాలు వల్లించడం సరికాదని హితవు పలికారు.