ఒంగోలులో టీడీపీ మహానాడు భారీస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఆయనకు మతి భ్రమించిందని ఎన్టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. వరుణ దేవుడి ఆశీస్సులు రాజశేఖర్ కుటుంబానికి ఉంటాయని చెప్పటానికి కురుస్తున్న వర్షాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి జయరాం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
చరిత్రలో ఇంత వరకు ఎవరూ బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. లోకేష్ ముద్దపప్పు అని.. టీడీపీకి ఇదే చివరి మహానాడు అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని మంత్రి గుమ్మనూరు జయరాం ఆరోపించారు. వందకు వెయ్యి శాతం మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.
Chandra Babu: కేంద్రం మెడలు వంచుతామని.. వీళ్లే మెడలు దించేశారు
మరోవైపు శెట్టి బలిజలను కించ పరుస్తూ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తోందన్నారు. ఏ వర్గాన్ని అయినా ఇలా కించ పరచటం కరెక్ట్ కాదని సూచించారు. జూపుడి ప్రభాకర్ వ్యాఖ్యల వల్ల మనోభావాలు దెబ్బతిన్న శెట్టి బలిజలకు తన తరపున క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు.