టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. చేతకాని పాలన వల్ల ఏపీ పరువుపోయిందన్నారు. అటు మూడేళ్లుగా తమ నేతలను, కార్యకర్తలను ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తాను నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. అనవసరంగా ఉన్మాది చేతిలో బలికావొద్దని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. ఏపీలో పోలీసుల్లో మార్పు రావాలని… వాళ్ల లాఠీదెబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరని చంద్రబాబు హెచ్చరించారు. సంఘవిద్రోహక శక్తులను వదిలిపెట్టి పోలీసులు టీడీపీ కార్యకర్తల వెంట పడుతున్నారని విమర్శించారు.
ప్రజల ఇబ్బందులపై టీడీపీ నేతలు నిలదీస్తే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇంటిపన్ను, చెత్తపన్ను పెంచేశారని.. ఏపీలో ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా ఉందా, పెళ్లికానుక, రంజాన్ తోఫా, విదేశీ విద్య ఉన్నాయా అని చంద్రబాబు అడిగారు. ఎన్టీఆర్ క్యాంటీన్‌లను తీసివేసి జగన్ నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న సంక్షేమం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడి అంటూ నాన్న బుడ్డిని అమలు చేస్తున్నారని కౌంటర్ వేశారు. రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారని.. అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారని నిలదీశారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ధరలు పెంచి దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
Telugu Desam Party: హిందూపురంలో బాలయ్య పర్యటనపై పోలీసుల ఆంక్షలు
గతంలో తాను హైదరాబాద్ నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీగా మార్చానని చంద్రబాబు గుర్తుచేశారు. ఆనాటి అభివృద్ధి ఫలాలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి విజన్ 2029 పెట్టామని.. అమరావతి ఏం పాపం చేసిందో జగన్ చెప్పాలన్నారు. జగన్ నిర్వాకం వల్ల రూ.2లక్షల- రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్నారు. పోలవరం విశిష్టత జగన్ రెడ్డికి తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. ఇప్పుడు కేంద్రం ముందు వైసీపీ నేతలు మెడలు దించేశారని చంద్రబాబు చురకలంటించారు.
మరోవైపు వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేసింది ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వమన్నారు. రైతులు తమ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వకుండా పోరాడాలని సూచించారు. రైతుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయని.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. టీడీపీ రైతులకు అండగా ఉంటుందని చంద్రబాబు సూచించారు.