Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఏపీకి వారాహి వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు అనుగుణంగా ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇక్కడి అధికారులు చూస్తారన్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం లేకుంటే వాహనం మార్చాల్సిన అవసరం ఉండదని.. కేవలం రంగు మాత్రమే మార్చాల్సి ఉంటుందన్నారు. పవన్‌కు రంగులు మార్చడం తేలికే కదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 2014 నుంచి ఎన్ని రంగులు మార్చాడో ప్రజలందరూ చూశారని తెలిపారు. తెలంగాణలో తిరగటానికి వారాహి రిజిస్ట్రేషన్ తెలంగాణలో చేయించారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ నెంబర్ కూడా 23 వచ్చేలా చేయించాడని చురకలు అంటించారు.
అటు చంద్రబాబు ఐదేళ్ళ కాలంలో వచ్చిన పెట్టుబడుల కంటే తమ మూడేళ్లలో వచ్చిన పెట్టుబడులు ఎక్కువ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని టీడీపీ మీడియాలో విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఇవాళే ఎస్ఐపీబీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. రేపు కేబినెట్‌లో పెట్టుబడులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులు అని చంద్రబాబు తన హయాంలో ప్రచారం చేశారని.. కానీ వచ్చినవి కేవలం రూ.30 వేల కోట్ల పెట్టుబడులే అని మంత్రి అమర్నాథ్ గుర్తుచేశారు. కానీ తాము అలా అబద్ధాలు ప్రచారం చేసుకోమని.. అమర్‌రాజా కంపెనీ ప్రతినిధులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టాల్సిన పెట్టుబడులను తెలంగాణలో పెడుతున్నాం అని చెప్పారా అని ప్రశ్నించారు. ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యమే ప్రభుత్వానికి ఉంటే హెరిటేజ్ రాష్ట్రంలో ఉండేదా అన్నారు. ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లు, ప్రియా పచ్చళ్ళు లేవా అని సూటి ప్రశ్న వేశారు. జాకీ కంపెనీ చంద్రబాబు హయాంలోనే వెళ్లిపోయిందన్నారు. పరిటాల శ్రీరామ్ వాళ్ళ వ్యవహారాలు తట్టుకోలేక జాకీ పరిశ్రమ ప్రతినిధులు వెళ్లిపోయారని విమర్శించారు. పరిశ్రమలకు కావాల్సిన పూర్తి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని.. ముఖ్యమంత్రి జగన్ పదే పదే ఇదే విషయాన్ని చెప్పారన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారంతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Central Government: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రపైనా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి అరసవిల్లి డ్రామా పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం గురించి ప్రస్తావించారు. కోర్టు పాదయాత్ర చేసుకోండి అని చెప్పినా అమరావతి రైతులకు ముఖం చెల్లలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలని తాము కోరామని.. తమ నినాదం ముందు వాళ్ల పాదయాత్ర తలవంచక తప్పదన్నారు. చంద్రబాబు పత్రికలు ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నాయని.. ఇప్పుడు వాటర్ మ్యాన్‌ను తీసుకుని వచ్చి కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలన్నీ టూరిజం శాఖకు సంబంధించినవి అని వివరించారు. గతంలో ఎప్పుడూ కొండలపై నిర్మాణాలు జరగలేదా అని ప్రశ్నించారు. రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి గత 25 ఏళ్ళుగా రామోజీ రావుకు సన్నిహితుడు అని.. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు పచ్చటి పొలాల్లో నిర్మాణాలు చేస్తే ఎవరికీ కన్నీళ్ళు రాలేదా అని నిలదీశారు. అది పర్యావరణ విధ్వంసం కాదా అన్నారు. అప్పుడు ఎందుకు చంద్రబాబు పత్రికలు కథనాలు వండలేదో చెప్పాలన్నారు. విశాఖలో రుషికొండ పక్కన ఉన్న కొండలపై రామానాయుడు స్టూడియో ఉందని గుర్తుచేశారు. ఒక కొండపై ఐటీ ఆఫీసులు ఉన్నాయనన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళే దారి కోసం ఎన్ని కొండలను పిండి చేశారో చెప్పాలన్నారు. విశాఖ కేంద్రంగా జరిగే అభివృద్ధిని అడ్డుకోవటానికి కుట్రలు పన్నుతున్నారని.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు తన హయాంలో చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.