NTV Telugu Site icon

Dharmana Prasada Rao: మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి..! ఓ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం..

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.. జన్మ భూమి కార్యకర్తలు స్వతంత్ర సమరయోధుల్లా వీధుల్లో పడి తిరిగేవాళ్లని విమర్శించారు. కానీ, వైఎస్‌ జగన్‌ సర్కార్‌లో సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా.. నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని.. ఈ ప్రభుత్వంలో సంక్షేమం చూడలేక బాదుడే బాదుడు అని చంద్రబాబు తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చే శారు.

Read Also: Lucky Lakshman Movie Review: లక్కీ లక్ష్మణ్ రివ్యూ

ఇక, ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమరావతి రాజధాని అని చంద్రబాబు చెబుతున్నారంటే మన చేతులతో మన కళ్లని పొడిచే ప్రయత్నమే అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన.. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెబుతున్నాడు.. అదే జరిగితే, మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి.. మేం ఒక చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాల్లో ఇంకా ఎక్కడో సైకిల్ భావన ఉంది, ఇంకా సైకిల్ ని నమ్మి మోసపోకండి అంటూ పిలుపునిచ్చారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని ఆరోపించారు.. ముసలివాడు అయినా మొన్న కారుమీద ఎక్కి డ్యాన్స్‌లు చేశాడు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అయితే, మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి..

Show comments