టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల పెద్ద అప్పుల మంత్రి అయితే చంద్రబాబు అబద్దాల నాయుడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆలస్యమవుతోందని విమర్శించిన ఆయన.. కాఫర్ డ్యామ్‌లో గ్యాప్ వదిలేయటం వల్లే డయాఫ్రాం వాల్ దెబ్బతిందన్నారు.. ఆ గోతులు పూడ్చేందుకు సమయం పడుతోందని.. ప్రస్తుత రేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోడానికి సమయం పడుతుందన్నారు.. ఇక, టీడీపీ పాత రేట్లతోనే ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నిచటం వల్లే నిధుల్లేక నిర్మాణం ఆలస్యమైందని మండిపడ్డారు.
Read Also: AP CID: ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. చంద్రబాబును ఏ1గా చేర్చిన సీఐడీ
మరోవైపు, గత ప్రభుత్వ హాయంలోనే ఎక్కువ అప్పులు చేశారని ఆరోపించారు మంత్రి బుగ్గన.. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే రాయలసీమ ప్రాంత వాసులు కోరుతున్నారని స్పష్టం చేసిన ఆయన.. అప్పట్లో రాజధాని వదిలేసిన పెద్ద మనసు కర్నూలు వాసులది అన్నారు.. ఇప్పుడు పాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులు పెడితే తప్పేంటి..? అని నిలదీశారు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వైసీపీ, బీజేపీలు అనుకూలంగా ఉన్నాయి.. కానీ, చంద్రబాబుకే ఓ స్టాండ్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఆర్థిక మంత్రిగా నేను అప్పులు చేస్తాను.. మరి పాల వ్యాపారం చేసుకుంటోన్న చంద్రబాబును పాల నాయుడనలా..? అని ఎద్దేవా చేసిన విషయం విదితమే.. చంద్రబాబు రౌడీ షీటర్ మాదిరి మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. నా ఇంటిని.. నా జీవితాన్ని కూలుస్తానని చంద్రబాబు అంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సొంత మామ, బావమరిది జీవితాలను చంద్రబాబు కూల్చారని విమర్శించిన బుగ్గన.. తాను వందేళ్ల క్రితం కట్టిన ఇంటిలో ఉంటున్నానని.. నా ఊళ్లోనే ఉంటున్నాను.. నారా వారి పల్లెలో చంద్రబాబు ఎక్కడున్నారు..? అని ప్రశ్నించారు. కాగా, కర్నూలు పర్యటనలో మంత్రి బుగ్గనపై చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు.. వాటికి కౌంటర్ ఇస్తూ వస్తున్న మంత్రి బుగ్గన.. ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.