ఇవాళ ఏపీ బడ్జెట్టును ప్రవేశపెట్టనున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతారు మంత్రి బుగ్గన. ఇదిలా వుంటే బుగ్గన నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు బడ్జెట్ గురించి చర్చించారు. బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం వుందని తెలుస్తోంది.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు భారీగానే వున్నా నిధుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉండిపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. కేటాయింపులు ఫుల్.. నిధులు నిల్ అన్న చందంగా మారింది. గతంలోని పెండింగు బిల్లులు.. ఈ ఏడాది బడ్జెట్‌లో చూపడం లేదు. ఫలితంగా ఆ నిధులు పొందాలంటే మళ్లీ కొత్తగా బడ్జెట్ విడుదల ఉత్తర్వులు పొందాలి.
కరోనా పరిస్థితులు, ఇతర ఇబ్బందుల కారణంగా రెవిన్యూ రాబడులు అంతగా లేవు. ఇప్పుడిప్పుడే పన్ను వసూళ్ళు పెరుగుతున్నాయి. జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు లక్షా ,11 వేల 792 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చినెలల్లో మరో రూ.25వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక శాఖ అధికారులు. జనవరి నెలాఖరు వరకు మొత్తం ఖర్చు లక్షా 69 వేల 842 కోట్లకే పరిమితమైంది. మొత్తం రూ. 2 లక్షల 28 వేల కోట్ల బడ్జెట్ అంచనాల్లో దాదాపు రూ.లక్ష కోట్లు ఇతరత్రా అప్పుల రూపంలోనే తీసుకురావాల్సి వుంది. ఈసారి బుగ్గన వారి లెక్కలు ఎలా వుంటాయోనని అంతా ఎదురుచూస్తున్నారు.