టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు పథకాలు ఏమీ ఇవ్వనని చంద్రబాబు పరోక్షంగా చెప్తున్నారని బొత్స ఆరోపించారు. సంక్షేమ పథకాల రూపంలో డీబీటీ ద్వారా చేసిన ప్రయోజనం పేద ప్రజల కోసం కాదని.. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నది చంద్రబాబు ఉద్దేశమన్నారు. ఇది దుర్మార్గపు ఆలోచనగా బొత్స విమర్శలు చేశారు. ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబుకు పేరుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా క్రీములు, పౌడర్ల కోసం తాము నిధులు వాడలేదని చురకలు అంటించారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు తరహాలో అర్ధరాత్రి తాము మాట మార్చలేదన్నారు. కాంట్రాక్టుల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడని.. లక్షల కోట్లు తెచ్చి తమ సామాజిక వర్గానికి మాత్రమే ప్రయోజనం కలగాలని చంద్రబాబు అంటే ఎలా సాధ్యమవుతుందని బొత్స ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేంటని నిలదీశారు. దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడని బొత్స ఆరోపించారు. బాలకృష్ణ సినిమా వాడు కాబట్టి సినిమా డైలాగులు చెబుతున్నాడని.. బాలకృష్ణ నాన్నను, రాష్ట్రాన్నే ఆయన బావమరిది మింగేశాడని చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు.