ఏపీలో జిల్లాల విభజనకు సంబంధించి శనివారం అర్ధరాత్రి కొత్త నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 26 జిల్లాలకు కొత్త కలెక్టర్ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల అడ్రస్‌లతో నోటిఫికేషన్ జారీ చేశారు. మరోవైపు జిల్లా పరిషత్ల విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో జిల్లా పరిషత్‍ల విభజన లేనట్లేనని ఆయన స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ల విభజనపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. ప్రస్తుతమున్న జిల్లా పరిషత్‌ల నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. అధ్యయనం తర్వాత జిల్లా పరిషత్ల విభజనపై విధివిధానాలు ప్రకటిస్తామని బొత్స స్యతనారాయణ పేర్కొన్నారు.
ఇక కొత్త జిల్లాల విభజనతో ఏపీలో ప్రస్తుతం జిల్లాల సంఖ్య 26కి పెరిగింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రభుత్వం జిల్లాలను విభజించింది. ఈ ప్రకారం 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ విస్తీర్ణం దృష్ట్యా అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ వీటిని విడుదల చేశారు. అంతకుముందు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
https://ntvtelugu.com/andhrapradesh-new-districts-final-gazette-notification-released/