హైకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఓవైపు.. లేదు మూడు రాజధానులే మా విధానం అంటూ మరోవైపు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, ఈ వ్యవహారంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఒకటికి పది సార్లు చెబుతున్నాం… మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. పాలనా వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్న ఆయన.. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిందని.. అందులో కూడా పాలన వికేంద్రీకరణ అంశాన్ని ప్రస్తావించారని. దానిని మేం తీసుకున్నామని తెలిపారు.
Read Also: Congress Leader Ravali : తెలంగాణలో 3 రోజులు తమాషా జరగబోతోంది
ఇక, మా నాయుకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలు మాకు ప్రామాణికం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తెలుగుదేశం పార్టీ నేతల ఆలోచనలు మాకు ప్రామాణికం కాదని ఎద్దేవా చేసిన ఆయన.. రానున్న అసెంబ్లీలో బిల్లు పెట్టే అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.. మరోవైపు, జిల్లాల పునర్విభజనపై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందన్నారు మంత్రి బొత్స. కాగా, రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.. ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఏపీ ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.