జూలై 8,9 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించబోతున్నామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేసిందో ప్రజలకు వైసీపీ నేతలు వివరించాలని ఆయన సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. అటు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వనంటాడు.. బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు.. ఒకసారి మూడు ఆప్షన్లు ఉన్నాయంటారు.. మరోసారి ప్రజలతోనే పొత్తు అంటారు అంటూ చురకలు అంటించారు. రహస్య మిత్రుడు చంద్రబాబుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను పవన్ కళ్యాణ్ ఓడించలేరని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇప్పటివరకు లక్షా యాభై వేల కోట్ల నిధులు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో చేరాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
అటు మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని కొనియాడారు. పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడానికి సచివాలయం, వాలంటరీ వ్యవస్థలను ముఖ్యమంత్రి తీసుకువచ్చారన్నారు. ఒకటో తేదీన తెల్లవారుజామున ఐదున్నరకే లబ్ధిదారులకు పింఛను ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని మంత్రి విడదల రజినీ గుర్తుచేశారు. ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని.. ఈ పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. ఎక్కడ అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.700 కోట్ల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరాయని మంత్రి విడదల రజినీ వివరించారు.