Ambati Rambabu: ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్ 1పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జీవో నంబర్ 1ను చంద్రబాబు పాటించలేదని.. ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్లుగా ఉందని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్నాడని.. జీవో నంబర్ 1 ప్రకారం రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టకూడదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే సభలు నిర్వహించాలన్నారు. జీవో నంబర్ 1 వైసీపీకి కూడా వర్తిస్తుందన్నారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. అప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తిరిగితే ఏమవుతుంది.. ఏమయ్యిందో అందరూ చూశారన్నారు. తిరిగిన తర్వాతేగా 23 స్థానాలకు పరిమితం అయ్యారని చురకలు అంటించారు.
Read Also: Mirchi Price: పసిడిని దాటిన మిర్చి రేట్.. ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర
కుప్పంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కూడా చంద్రబాబు గెలవలేకపోయాడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నా కుప్పం…నా కుప్పం అంటూ చంద్రబాబు రంకెలు వేస్తున్నాడని.. ఆ కుప్పంలో ఇల్లు కాదు కదా ఓటు కూడా చంద్రబాబుకు లేదన్నారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసింది జగన్ అని గుర్తుచేశారు. చంద్రబాబు ఎక్కడకు వెళితే అక్కడ శని దాపురిస్తుందని ఆరోపించారు. పుష్కరాల్లో ఫోటో షూట్ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు. అయినా చంద్రబాబులో పశ్చాత్తాపం కనిపించడంలేదన్నారు.
Read Also: Suma Adda: యాంకర్ సుమతో మల్లెమాల కొత్త షో.. ప్రోమో వైరల్
కందుకూరు, గుంటూరు ఘటనల్లో 11 మంది చనిపోతే పెద్ద విషయం కాదా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కుప్పంలో లాఠీఛార్జ్ జరిగి కార్యకర్తలు గాయపడినట్లు డ్రామాలు ఆడి పరామర్శ చేసే ఖర్మ చంద్రబాబుకు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. దుప్పట్లు, ఉల్లిపాయ, చింతపండు పంచే కార్యక్రమాలకు హాజరయ్యే దీన స్థితిలో చంద్రబాబు ఉన్నాడని ఎద్దేవా చేశారు. అటు సలహాదారులు గత ప్రభుత్వంలోనూ ఉన్నారని.. తమ ప్రభుత్వమే కొత్తగా తీసుకుని వచ్చిన విధానం కాదన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ అంశంపై స్పందిస్తామన్నారు. సుచరిత చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని.. భర్తతో పాటు ఉంటాను… అందరం కలిసి జగన్‌తో పాటే ఉండాలనుకుంటున్నామని ఆమె అన్నారని… అందులో తప్పేం ఉందని అంబటి రాంబాబు అన్నారు.