టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి రక్తం బాగా మరిగిన పులికి వేటాడటానికి మనుషులు దొరకనప్పుడు ఎలా పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తుందో, అధికారం పోయినందుకు చంద్రబాబుకి అదే పిచ్చి హిమాలయాలకు చేరిందని ఆరోపించారు. దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు దాదాపు 1.39 లక్షల కోట్లు… అది కూడా 35 నెలల్లో పేదల చేతిలో వైసీపీ ప్రభుత్వం పెట్టిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంటనక్కకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
అసలు చంద్రబాబు పాలనలో స్కీములు గానీ, డీబీటీలు గానీ లేవని చెప్పారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్నాల్లో బాబు తన ఐదేళ్ళ పాలనలో ఏ ఒక్కటైనా అమలు చేశాడా? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడొస్తున్న ఆదాయమే అప్పుడూ వచ్చిందని, ఏ స్కీములూ అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బంతా ఏం చేసిందని నిలదీశారు. జన్మభూమి కమిటీల పేరుతో కింద స్థాయిలోనూ.. జల యజ్ఞం, రాజధాని, ఇసుక, మద్యం పేరిట అంటూ పై స్థాయిలో దోపిడీ చేయడమే సరిపోయిందని ఆరోపణలు చేశారు. బాబుకు, ఎల్లో మందకి ఇప్పుడు అడ్డంగా ఆంబోతులా తినే అవకాశం లేకపోవడం వల్లే ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.
విశాఖకు రాజధాని వెళ్ళటం ఖాయమని అర్థం అవ్వడం వల్ల, అమరావతిలో తన బినామీల భూములకు రేట్లు పెరగవని బాబు ఏడుస్తున్నారన్నారు. విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా? అని అడిగిన చంద్రబాబును… అమరావతి అభివృద్ధి కావాలా? లేక రాజధాని కావాలా? అని ప్రశ్నించారు. విశాఖను ఉత్తరాంధ్రకు త్యాగం చేయమని బాబు అడుగుతున్నారని, ఇంతకంటే నీచం మరొకటి ఉంటుందా? అని చెప్పారు. టీడీపీకి, రాష్ట్రానికి చంద్రబాబుకు మించిన ఐరన్ లెగ్ ఇంకెవరుంటారన్నారు. కొడుకు ఐరన్ లెగ్-2 అని గమనించిన తర్వాతే, దత్తపుత్రుడి మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్నారన్నారు. తన మీద నమ్మకం లేకపోవడం వల్లే పవన్‌కి మళ్ళీ కన్ను కొడుతున్నారన్నారు.
44 ఏళ్ళ రాజకీయంలో సీఎం పదవి పక్కాగా వచ్చిందా? లేక పక్క నుంచి వచ్చిందా అన్నది అందరికీ బాగా తెలుసని చెప్పిన అమర్నాథ్.. బాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు. ‘‘బాబుకు ఒకటే చెప్తున్నాం… విశాఖను, ఉత్తరాంధ్రను దెబ్బతీసి… అమరావతిలో బినామీ భూముల రేట్ల కోసం చేసే కుట్రలకు, కుతంత్రాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అంటూ గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.