సంక్రాంతి ముగిసేసరికి చలి తీవ్రత తగ్గాలి. కానీ ఈసారి సంక్రాంతి తర్వాత చలి చంపేస్తోంది. ఉదయం సూరీడు రావడం లేటవుతోంది. శనివారం ఏపీలో అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు నిజమయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ చలి తీవ్రంగా వుండే అరకు ఈసారి కూడా అదే చలి ప్రభావం కనిపిస్తోంది. ఆంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లాలో జంగమహేశ్వరపురంలో శనివారం ఉదయం 5.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఏపీ రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం అని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో కనీస ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా వుంది. గతంలో 13.2 డిగ్రీల సెల్సియస్ గా వుండగా అది 4.2 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నంలో 14 డిగ్రీలు నమోదైంది. బాపట్లలో 15.1 నమోదైంది. గత ఉష్ణోగ్రతల కంటే 2.5 డిగ్రీలు తక్కువ. కర్నూలులో 15.5 డిగ్రీలు కాగా గతంలో కంటే 2.1 డిగ్రీల సెల్సియస్ గా వుంది. తూర్పు నుంచి వస్తున్న శీతల గాలుల కారణంగానే 2 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి రానున్న రెండురోజులలో వుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.గత వారంలో చింతపల్లిలో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా తాజాగా అది 5.6 డిగ్రీలకు పడిపోయింది.