Bharat Bandh: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌కి నిరసనగా రేపు (నవంబర్ 23న) దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాసిన లేఖలో.. నిరాయుధులైన హిడ్మా, అతడి భార్య రాజే సహా ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకుని ఆ తరువాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చెప్పుకున్నారని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వచ్చారని, విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐబీ పోలీసులు అతన్ని పట్టుకుని.. 15న అరెస్ట్ చేసి, 18వ తేదీన హిడ్మాను బుటకపు ఎన్ కౌంటర్ చేశారని మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి అభయ్ ఆరోపించారు.
Read Also: Adani Group: ఆరేళ్లలో ఆరు ప్రధాన కంపెనీలను కొన్న అదానీ.. అవి ఏంటో తెలుసా!
అలాగే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆదివాసీ సంఘం సీనియర్ నాయకుడు మనీష్ కుంజా కూడా ఈ ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించారు. తాడిమెట్ల, జీరంఘాట్ ఘటనల్లో మాద్వి హిడ్మా ప్రమేయం లేదని పేర్కొన్నారు. ఆంధ్రాకు చెందిన కొంత మంది పార్టీకి చెందిన నాయకులే హిడ్మా కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఈ ఎన్‌కౌంటర్‌లో దేవ్‌జీ పాత్ర ఉందని తెలుస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ ని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే రేపు (నవంబర్ 23) భారత్ బంద్‌కి పిలుపునివ్వడంతో.. భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజా ప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతాలను విడిచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచనలు చేశారు.