Mining Mafia: ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కలిదిండి, ముదినేపల్లిలో పెద్ద ఎత్తున ఇసుక ఉండటంతో ఈ ప్రాంతం నుండి లారీలతో బుసక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తూ మైనింగ్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ప్రభుత్వం నుంచి మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే.. ఒక హెక్టార్ కి ఆరు లక్షల రూపాయలు చెల్లించాలి. ఇవేమీ చెల్లించకుండానే లారీలు, ట్రాక్టర్లతో బుసక తరలించుకు పోతుంటే మైనింగ్ శాఖ ఇటువైపు చూడని పరిస్థితి ఉంది. మరోవైపు పరిమితికి మించి లారీ, టిప్పర్‌లో బుసకను లోడు చేయటం, అతివేగంగా నడపటం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా చేసేంది అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరులే కావటంతో అడ్డుకునే వారు లేకుండా పోయారు.
Read Also: Nizamabad: పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!
పెనమలూరులో రాత్రి వేళల్లో టిప్పర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అటు తోట్లవల్లూరు, రొయ్యూరులో అనుమతులు ముగిసినా కూడా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. మైనింగ్‌ను గుర్తించటానికి పోలీస్ ఉన్నతాధికారులు వచ్చే సమయానికి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. తనిఖీలు ముగిసిన తర్వాత మళ్లీ మైనింగే చేస్తున్నారు అక్రమార్కులు. ఇబ్రహీంపట్నంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఫెర్రీ ఇసుక రేవులో గత కొన్ని రోజులుగా ఇసుక రవాణా జరుగుతోంది. దీనిపై వరుస ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టక తప్పలేదు. మొత్తం 23 ట్రాక్టర్ లను సీజ్ చేశారు.. రెడ్డిగూడెం మండలంలో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ మైనింగ్ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు చెరువులు పూడికతీత పేరుతో మూడు అడుగులు తీయమంటే పది నుంచి 15 అడుగుల వరకు తవ్వి అమ్ముకుంటున్న పరిస్థితి. ఇక మచిలీపట్నంలో బీచ్ శాండ్‌ను నిబంధనలను విరుద్ధంగా తవ్వేస్తున్నారు. వీటన్నింటికి కర్మ కర్త క్రియ అధికార పార్టీ నేతల అనుచరులు కావటంతో అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని సమాచారం. స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవటంతో మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోతోంది.