Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!

Kodali Nani

Kodali Nani

Kodali Nani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. రావణ్ అరెస్టు అంశంపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రావణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూల వ్యక్తి అని, ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువల్లే టీడీపీ నాయకులపై ఆయన ఎప్పుడూ విమర్శలు చేయరని అన్నారు. రావణ్‌పై టీడీపీ ప్రభుత్వం గతంలో కేసులు నమోదు చేయలేదని, జనసేనతో కలిసి పోలీస్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఆందోళనలకు పాల్పడలేదని నాని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ తమపై రావణ్ విమర్శలు చేసినప్పటికీ వాటిని అణచివేయలేదని చెప్పారు.

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే వారిని కొత్త చట్టాల పేరుతో జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు కొడాలి నాని. ప్రజల గొంతును నొక్కివేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ పార్టీని “గొడ్డలి పార్టీ” అని వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబుకు రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. తనకు నచ్చని వ్యక్తులను పోలీస్ స్టేషన్లలో తగలబెట్టించే పార్టీగా టీడీపీపై ప్రజల్లో “బూడిద పార్టీ” అనే అభిప్రాయం ఏర్పడుతోందని నాని వ్యాఖ్యానించారు. గత ఏడాదిగా పవన్ కల్యాణ్‌పై మాట్లాడుతుండటమే రావణ్ అరెస్టుకు కారణమని, జనసేన కక్షపూరితంగా కేసులు పెట్టి ఆయనను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసిన తర్వాతే కొత్త చట్టాలను తీసుకొచ్చారని చెప్పారు. రావణ్‌ను వైసీపీ వ్యక్తిగా ప్రచారం చేస్తున్నది టీడీపీ అనుకూల వర్గాలేనని, ఎల్లో మీడియా అసత్య కథనాల ద్వారా ఈ వ్యవహారాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని..