Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఒక్కో నేత.. ఒక్కో ఆటంబాంబులాంటి మాటలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ పార్టీ మారతారన్న ప్రచారం ప్రకంపనలు రేపుతోంది. ఆయన ఆడియో టేపు దుమారం సృష్టిస్తోంది. దీంతో రేపు సీఎం జగన్ దగ్గర నెల్లూరు పంచాయితీ వుంటుందని తెలుస్తోంది. సమావేశం తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్త పేరును ప్రకటించే అవకాశం వుంది. కోటంరెడ్డి ఇష్యూపై మంత్రి కాకాణి గోవర్ధన్‌తో బాలినేని సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కోటంరెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కోటంరెడ్డి టీడీపీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. పోయేవాడు పోకుండా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చెయ్యడమేంటని బాలినేని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌ను రుజువు చెయ్యాలని సవాల్ విసిరారు. కోటంరెడ్డి అన్నదమ్ముల మధ్య తాము పంచాయితీ పెట్టలేదన్న బాలినేని.. వెంకటగిరిలో కూడా ఇంచార్జిని నియమిస్తామని తెలిపారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మరోవైపు రేపు మీడియా ముందుకు రానున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. బాలినేని వ్యాఖ్యలపై స్పందించనున్నారు. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్న బాలినేని వ్యాఖ్యలకు.. ఆధారాలు చూపుతానని కోటంరెడ్డి అన్నారని తెలుస్తోంది. ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని బయటపెట్టలేదని ఆయన అన్నారు. కానీ.. ఇప్పుడు సాక్ష్యాలు బయటపెట్టక తప్పదంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. వైసీపీలో అసంతృప్తులపై ఫోన్ ట్యాపింగ్ అందరికీ తెలియాలని తెగేసి చెబుతున్నారు. హోంమంత్రి అమిత్‌షాకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి… అయితే, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా నంటూ శ్రీధర్‌రెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. వైసీపీలో జరుగుతున్న అవమానాలు భరించలేనని.. ప్రజల కోసమే పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడానని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. అంతేకాదు, ఫోన్ టాప్ చేస్తున్నారనే దానికి తన దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారాయన. ఆ సాక్ష్యం బయటపెడితే ప్రభుత్వమే షేక్ అవుతుందని అంటున్నారు.