Kodali Nani: గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీడీపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా, ఆయన పుత్రరత్నం లోకేష్ పోటీ చేసినా వైసీసీ అభ్యర్థిగానే తానే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అండ్ కో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, కుల సంఘాలు వచ్చిన అరిచి గోల చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కేవలం సీఎం జగన్‌ను తిట్టేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని.. చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేదేమీ లేదని చురలు అంటించారు. చంద్రబాబుకే కాకుండా టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కొడాలి నాని జోస్యం చెప్పారు.
Read Also: Thopudurthi Prakash Reddy: టీడీపీ కారణంగా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదు
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నాడని.. టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేష్‌ను తరిమేందుకు ఎన్టీఆర్ వారసులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతానని చంద్రబాబు మాట్లాడాడని కొడాలి నాని గుర్తుచేశారు. 2024 ఎన్నికల తరువాత ఇదేం ఖర్మరా అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారని ఎద్దేవా చేశారు. తాను ఎవ్వరికీ భయపడే రకాన్ని కాదని.. ఎంతమంది వచ్చినా గుడివాడ ప్రజలను ప్రభావితం చేయలేరని పేర్కొన్నారు. జీవించి ఉన్నంతకాలం జగన్ సీఎంగా ఉంటారని కొడాలి నాని అన్నారు. తన ఆఖరి రక్తపుబొట్టు వరకు జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు.