వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి.. రెండో కేబినెట్‌లో మాత్రం చోటు దక్కలేదు.. అయితే, మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి.. ఇవాళ కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో పర్యటించారు.. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికి ఘన స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే నాకు ఇష్టం, మాజీమంత్రి అని పిలవొద్దు అని సూచించారు.. ఇక, మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానం, ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Vasireddy Padma: బాధితురాలి దగ్గర బలప్రదర్శన..! పరామర్శ అంటే ఏంటో టీడీపీ చెప్పాలి..!
చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని మండిపడ్డారు కొడాలి నాని.. నాకు సీఎం వైఎస్ జగన్ వెనుక పని చేయడమే ముఖ్యమన్న ఆయన.. 420 గ్యాంగ్, చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు, రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్న ఆయన.. దేవుడులాంటి వైఎస్ఆర్ ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు కొడాలి నాని.