Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబు జగన్‌పై విమర్శలు చేస్తున్నాడని.. హైదరాబాద్‌ను నిర్మించడం ప్రారంభించింది తానేనని చెప్పుకుంటున్నాడని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని.. 1995లో చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత హైదరాబాద్‌ను నిర్మించడం ప్రారంభించాడట.. దానిని వైఎస్ఆర్ కొనసాగించారట అంటూ ఎద్దేవా చేశారు. భ్రమరావతి పేరుతో చంద్రబాబు సృష్టించిన గ్రాఫిక్స్‌ను జగన్ కొనసాగించాలా అని ప్రశ్నించారు. అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టవచ్చు అనుకుంటున్నాడని.. ప్రజలు చంద్రబాబు మోసాన్ని గ్రహించే లాగి పెట్టి గూబ మీద కొట్టారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
Read Also: Rahul Gandhi’s T-shirt: రాహుల్ గాంధీ టీ షర్టుపై బీజేపీ విమర్శలు.. భారతదేశమా చూడండి అంటూ..
అమరావతి రాజధానిని ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలను చంద్రబాబు దాటిస్తాడట.. రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయా అని కొడాలి నాని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మందిని అనాధల్లా వదిలేసి మిగిలిన అన్ని ప్రాంతాలను గాలికి వదిలేయాలా అని నిలదీశారు. అంతా తీసుకుని వచ్చి అమరావతిలో పెడితే రాష్ట్రం దివాలా తీయదా అని సూటి ప్రశ్న వేశారు. ఢిల్లీ మహానగరానికి 72 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని.. 25కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉన్న మహా కార్పొరేషన్లతో రాష్ట్ర రాజధానులను తాడికొండతో చంద్రబాబు పోల్చుతున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఒక అసెంబ్లీలో 6 మండలాలు ఉంటే ఒక మండలంలోని 29 గ్రామాలతో ఉన్న అమరావతిని ఢిల్లీతో పోల్చుతూ ప్రజల్ని చంద్రబాబు మభ్యపెడుతున్నాడని విమర్శించారు. పరిపాలన రాజధానిగా విశాఖ అవ్వడం ఫిక్స్ అని కొడాలి నాని స్పష్టం చేశారు.