Kethireddy Pedda Reddy On JC Diwakar Reddy Over Traffic Police Station: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విషయమై ఖాకీ vs ఖద్దర్ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! మున్సిపల్ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మించాలని డీఎస్సీ చైతన్య తీసుకున్న నిర్ణయాన్ని మున్సిపల్ ఛైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మున్సిపల్ స్థలంలో స్టేషన్ కట్టొద్దని డిమాండ్ చేస్తోన్న ఆయన.. మున్సిపాల్టీ స్థలంలో కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీస్తున్నారు.
ఇలా తాడిపత్రిలో నెలకొన్న హై టెన్షన్ వాతావరణంలోనే.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎస్పీ ఫక్కీరప్ప ఈరోజు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తోన్న స్థలం మున్సిపాలిటీది కాదని అందరికీ తెలుసన్నారు. తాను వైసీపీతో పోరాడుతున్నానని చెప్పుకునేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. టీడీపీ నిర్వహించిన సర్వేల్లో కూడా జేసీ గెలవడని తెలిసిందని, చంద్రబాబు దృష్టిలో పడేందుకే ఈ వివాదం సృష్టిస్తున్నారని అన్నారు.
గతంలో పోలీస్ స్టేషన్‌కి తాళాలు వేసి ఆందోళన చేశారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే జేసీ మున్సిపల్ ఛైర్మన్ అయ్యారని పెద్దారెడ్డి చెప్పారు. కాగా.. పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమానికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.